96

                        
                        
క్షీరాబ్ధిద్వాదశీ (మథనద్వాదశీ వ్రత కథ) సూతపౌరాణికుడు శౌనకాదిమహర్షులను చూసి మీకు ఒక వ్రతము చెప్తాను వినండి అన్నాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామతో వనవిహారము చేయుటకు బృందావనమునకు వచ్చిఉండగా, అక్కడకి నారదుడు శ్రీకృష్ణమూర్తి దర్శనము కోసం వచ్చెను. అప్పుడు శ్రీకృష్ణుడు నారదమహాముని అర్ఘ్యపాద్యాది సత్ర్కియలచే గౌరవించి , తగిన పీఠమునందు కూర్చోపెట్టి “మునీంద్రా ! మీరు త్రిలోకాచారులు. సకల ధర్మములు తెలిసినవారు. లోకమునకు మంచి చేయు వారు. కావున మీరు ఒక వ్రతము నాకు తెలియచేయండి అని వేడెను”. ఓ యశోదానందనా! నేనిప్పుడు బ్రహ్మలోకమునుండి వస్తున్నాను. బ్రహ్మదేవుడు సరస్వతీ దేవికి ఆనతిచ్చిన ఒకవ్రతమును నీకు తెలిపెదను వినుము. ఆ వ్రతము వ్రతాలన్నింటిలో ఉత్తమమైనది, ఆ వ్రతము ఆచరించువారికి పుత్త్రపౌత్త్రాదులు, సకలసంపదలూ కలుగును. ఆ వ్రతము చేసే విధానమును చెప్తాను విను. ఆశ్వయుజ శుక్లపక్ష ఏకాదశినాడు ఉపవాసముండి తులసికోటముందు ఐదు పద్మముల ముగ్గులు పెట్టి, ఐదుదీపములు వెలిగించి, అక్కడ తులసీదేవిని మహావిష్ణుసమేతముగా ఆరాధించి, గంధపుష్పాక్షతలతో పూజించి, ఐదు విధములైన భక్ష్యఫలాదులను నివేదన చేసి, ఐదు తాంబూలములిచ్చి, ఐదు ప్రదక్షిణములను, ఐదు నమస్కారములను చేయవలెను. ఇట్లా ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధఏకాదశి వరకు పూజచేసి, ఆ ఏకాదశినాడు ఉపవాసము చేసి, మొదట పూజచేసినట్లే కల్పోక్త నియమముతో, తులసీదేవీపూజను, విష్ణుమూర్తిపూజను చేసి, చాప మొదలైనవి పరుచుకోకుండా నేలమీద పడుకొని రాత్రిజాగరణము చేయాలి. మరునాడు ఉదయాన్నే లేచి, స్నానమాచరించి, మంచి వస్త్రములు ధరించి, ఆభరణములు అలంకరించుకుని, ఒక మానెడు బియ్యపుపిండితో మూడు ముద్దలు చేసి, ఒకటి తులసీ దేవికి నివేదన చేసి, మరొకటి బ్రాహ్మణుడికి వాయనమిచ్చి, మరొకటి రోటిలో ఉంచి పాలుపోసి చెరుకు గడలతో దంచవలెను. అట్లా దంచినప్పుడు పాలచుక్కలు ఎన్ని తన దేహముమీద పడతాయో, అన్ని వేలయేండ్లు సర్వలోకాల్లో పూజింపబడతాడు”. అని నారదుడు చెప్పగా , శ్రీ కృష్ణుడు మునీంద్రా ఆ వ్రతము ఎవ్వరు ఆచరించిరి? ఆ వ్రతము చేయడం వలన వారికి ఏయే ఫలంబులు కలిగెను? తెలుపమని అడగగా నారదుడు ఈ విధంగా అనెను. ” ఓ మహాప్రభూ ! ” పూర్వము దేవదత్తుడనుపేరు గల ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు బ్రహ్మతేజస్సు గల వాడు. అతను వేదవేదాంగములు చదివి, వాటి అర్థమును తెలిసినవాడు. ఆ బ్రాహ్మణుడు సంతతి లేమిచే “ నేను సంతతిహీనుడనయి ఉన్నాను. కావున జగన్నాథుడగు విష్ణుమూర్తిని పూజించెదను”, అని మనస్సులో అనుకుని, సామాన్యజనులు చేయలేని తపస్సును చేసెను. అప్పుడు విష్ణుమూర్తి తన తపస్సుకు మెచ్చి, ముసలి బ్రాహ్మణరూపముతో ఆ దేవదత్తుడి ముందు నిలిచి “ఓ బ్రాహ్మణోత్తమా ! ఏవిధముగా ఇట్టి ఉగ్ర తపస్సు చేస్తున్నావు” అని అడగగా, ఆ బ్రాహ్మణోత్తముడు వెంటనే విష్ణుమూర్తికి వందనము చేసి, “ఓ దేవదేవా ! ఓ జగన్నాథ !! ఓ పురుషోత్తమా !!! నన్ను రక్షించు. తమ పాదారవిందముల దర్శనముచే నా జన్మ పావనమయ్యెను. ఇక నా మనోరథంబు సిద్ధింపగలదని నేను నమ్ముతున్నా”నని అనేకవిధాలుగా విష్ణుమూర్తిని పొగడగా, ఆ విష్ణుమూర్తి తనను అనేక విధాలుగా స్తుతిస్తున్న ఆ బ్రాహ్మణోత్తముడిని చూసి, “ ఓ విప్రోత్తమా! నీకు ఏ వరము కావలెనో కోరుకో” మనగా, ఆ ద్విజశ్రేష్ఠుడు “దేవదేవా ! నాకు సంతతి లేదు. “ అపుత్రస్య గతిర్నాస్తి” అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. కావున, అటువంటి హీనగతి లేకుండా, పుత్రుడు కలుగునట్లు వరమివ్వమని అడిగెను. అంతట శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణుడిని చూసి “విధిని తప్పించడం ఎవ్వరికీ వీలుకాదు. నీకు ఆయుష్షు లేని కుమారుడు కావలెనా? లేక బాల్యమునుండే వైధవ్యమును అనుభవించే కుమార్తె కావలెనా?” అని అడిగెను. అందుకు ఆ బ్రాహ్మణుడు “కేశవా ! నేను నా ఇంటికి వెళ్ళి, ఈ విషయము నా భార్యకు తెలియచెప్పి, తరువాత మీకు విన్నవించెదన”ని చెప్పి, తన ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యతో చెప్పగా, ఆ విప్రుడి ఇల్లాలు “నాథా! ఆయుష్షు లేని పుత్రుడ్ని కోరడం కంటే, విధవ అయ్యే కూతుర్ని కోరడడమే మేలు! మన ముందర, మొద్దుగానైనా పడిఉండును కదా! ” అని చెప్పగా, బ్రాహ్మణుడు తన పత్ని యొక్క అభిమతము ప్రకారముగా, దేవదేవుడయిన జగన్నాథుని వద్దకు వచ్చి విధవయైన కూతురినే ఇమ్మని వేడెను. విష్ణుమూర్తి అట్లే అగుగాక అని బ్రాహ్మణుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యెను. ఆ బ్రాహ్మణునికి తర్వాత కొంతకాలానికి కుమార్తె కలిగెను. ఆ కన్యక సర్వ శుభ లక్షణములతో కూడినదై, ఆరోగ్యవంతురాలై , శుక్లపక్షచంద్రుడివలె దినేదినే వృద్ధి చెందినది. ఆమెకు యుక్తవయస్సు రాగా, ఆమె రూపలావణ్యాతిశయంబుచే రతీదేవిని పోలియుండెను. అట్టి సౌందర్య రాశిఅగు ఆ కన్యకు వివాహప్రాయము రాగానే ఆ బ్రాహ్మణుడు వివాహము చేసెను. అట్టి ఆ బ్రాహ్మణుడి పుత్రిక లావణ్యవతి అయినా, పూర్వజన్మకృత దుష్కృత కర్మమువలన విధవ అయ్యెను. ఆపిల్ల యొక్క తల్లి తండ్రులు మనోదుఃఖముచే శీఘ్రకాలమునే పరలోకమునకు చేరిరి. తర్వాత ఆ విధవ స్త్రీ ఇంటికి పెద్దదై , అన్ని ధర్మములను వదిలి పెట్టి తన ఇంటికి ఏ అతిథి వచ్చి ఏది అడిగిననూ, “ లేదు నారాయణ, లేదు నారాయణ“ అని చెప్తూ కఠిన చిత్తురాలై, వచ్చినవారందరిని పొమ్మనటమే కానీ, ఏ ఒక్కరికైనా పిడికెడు బియ్యం పెట్టి ఎరుగదు. అది అట్లా ఉండగా , విష్ణుమూర్తి నారాయణా నారాయణా అని తన నామము ఉచ్చరిస్తున్నందువల్ల, మనస్సులో సంతసించి బ్రాహ్మణ వేషముతో ఆ విధవ ఇంటికి వచ్చి ఉపాదాన మడిగితే, ఆమె అందరికీ చెప్పినట్లే లేదు నారాయణా అని చెప్పెను. ఆ పలుకులు విని విష్ణుమూర్తి మరలా - ఎందుకమ్మా ఇలా ఇంటికి వచ్చినవారందరిని అవమానిస్తున్నావు? అనగానే ఆ విధవ కోపంతో కన్నెర్రచేసి, తాను ఇల్లు అలుకుతూ, తనచేతిలో పేడనీటితో నిండియున్న అలుకుగుడ్డను ఆ బ్రాహ్మణుడి ఒడిలోవేసెను. తర్వాత ఆ బ్రాహ్మణరూపి యగు విష్ణువు వెలుపలికి వచ్చి, ఆ అలుకుగడ్డను విదిలించి చూడగా దానిలో కంది గింజ ఒకటి కనిపించెను. శ్రీ మహావిష్ణువు కంది గింజ మొలక వేయగా అది మొలకెత్తి చెట్టుగా పెరిగెను. తర్వాత కొంతకాలానికి ఆ విధవ మృతి చెంది, చీడపురుగై పుట్టి ఆ కంది చెట్టు ఆకులను తినుచుండెను. తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు ఆ విధవ చీడపురుగై కంది చెట్టునందలి ఆకులను తినుటను గుర్తు తెచ్చుకుని, తన దేవేరి లక్ష్మీ సమేతుడై వచ్చి, ఆ కంది చెట్టున కీటకరూపమున ఉన్న ఆ విధవను చూశాడు, క్షేమముగా ఉన్నావా? అని అడిగాడు. ఇంతలో లక్ష్మీదేవి విష్ణుమూర్తినుండి ఆ కీటముయొక్క పూర్వజన్మవృత్తాంతమును విని, ఆమె జన్మకు ఎప్పుడు మోక్షము కలుగునని అడిగింది. దానికి సమాధానముగా- ఓ దేవీ- నీవు కార్తిక శుద్ధద్వాదశినాడు ఆచరించిన మథన ద్వాదశీ వ్రతఫలం ఈ పురుగుకు ఇమ్ము. చెరకు పాలబొట్టుపడు ఫలముచేతనే దీనికి ముక్తి కలుగునని చెప్పెను. వెంటనే లక్ష్మిదేవి అట్లే ఆమెకు మథనద్వాదశీ ఫలమునిచ్చినది. ఆ ఫలప్రభావముచే ఆమె కీటకజన్మను విడిచి స్త్రీ జన్మను ధరించెను. వెంటనే ఆ స్త్రీ, లక్ష్మీదేవితో తన ముందు నుంచున్న విష్ణుమూర్తిని చూసి, వారిద్దరికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, లక్ష్మీ దేవిని చూసి- ఓ జగజ్జననీ మీ పాదదర్శనముచే నా నోములన్నీ ఫలించాయి. నా జన్మ పావనమయ్యెను. ఈ వ్రతము నాకు ఉపదేశించండి. నేను ఆచరిస్తాను అని అడగగా, మహాలక్ష్మీ ఈవిధంగా అనెను. కార్తీక శుక్లపక్ష ఏకాదశినాడు ఉపవాసము చేసి, తులసీ కోట ముందర పంచవన్నె ముగ్గులతో ఐదు పద్మములు, రంగవల్లులు తీర్చి, తులసీ దేవిని శ్రీ మహావిష్ణువును షోడశోపచార పూజల పూజించి, రాత్రి జాగరణము చేసి, పురాణము మొదలగువానిచే . రాత్రి అంతా గడిపి, మరునాడు వేకువనే స్నానమాచరించి, మడిబట్ట కట్టుకుని, మరలా తులసీదేవికీ, విష్ణుమూర్తికి పూజచేసి మూడు పిండిముద్దలు చేసి, ఒకటి తులసికి నివేదనచేసి, మరొక్కటి బ్రాహ్మణునకు వాయన మిచ్చి, మిగిలిన ముద్దను రోటిలో వేసి పాలుపోసి, చెరుకు గడలతో, ముత్తైదువులచే దంపించాలి. అట్లా దంచిన తర్వాత 10మంది బ్రాహ్మణులకూ, 10 మంది సుమంగళీస్త్రీలకు, దక్షిణతాంబూలములు మొదలైనవి ఇచ్చి, షడ్రసోపేతమయిన భోజనము పెట్టి, తరువాత దానిని భుజింపవలెను. ఇట్లా ఐదుసంవత్సరములు చేయుచు నోము మొదలు పెట్టునప్పుడుకానీ, మధ్యలోకానీ, చివరిలోకానీ ఉద్యాపనము చేయవలెను. వారివారి శక్తి కొలది లక్ష్మీనారాయణుల ప్రతిమలనుంచి, ప్రాణప్రతిష్ఠను చేసి, ఐదేసి నమస్కారములు చేయవలెను. అట్లు పూజించి ఆ రాత్రి పురాణపఠనాదులచే కాలము గడిపి, మరునాడు ఉదయమున నదియందు స్నానముచేసి, ఇంటికి వచ్చి పునఃపూజ చేసి, శమదమాది సంపద గల సదాచారసంపన్నుడై గృహస్థుడైన బ్రాహ్మణుడికి, లేక తన పురోహితుడికి ప్రతిమా దానము చేయవలెను. తర్వాత 10మంది బ్రాహ్మణులకూ, 10 మంది సుమంగళీస్త్రీలకు షడ్రసోపేత భోజనములు పెట్టి, వారిని వస్త్రభూషణ తాంబూలాలతో సంతోషపరిచి, తర్వాత బ్రాహ్మణ సమారాధన చేసి, తాను తన బంధువులతో పాటుగా భోజనము చేయవలెను. ఈ వ్రతమునకు తమ శక్తివంచన లేకుండా ఉద్యాపన చేయవలెను. వ్రత ఉద్యాపన చేయకుంటే పురుగులై పుడతారు. విధి ప్రకారము ఈ వ్రతము చేయువారు, ఇహపరంబులందు సకల సౌఖ్యములను పొందతారని, వ్రతవిధానము చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానము చెందెను. తర్వాత ఆ వనిత మథన ద్వాదశీ వ్రతము చేసి ఇహలోకంబున సకలసౌఖ్యములు అనుభవించి, పిదప విష్ణుసాయుజ్యమును పొందెను. ఎవరు ఈ వ్రతకథను చదువుతున్నారో, లేక వినుచున్నారో, వారు సకల పాపములు తొలిగిపోయినవారై ఉత్తమలోకములను పొందుతారు. ఇది మథన ద్వాదశీ వ్రతకథ సంపూర్ణం.